Homeటాప్ స్టోరీస్ఈ ఏడాది తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉంది?

ఈ ఏడాది తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉంది?

this year movies analysis
this year movies analysis

ఎంత కాదనుకున్నా సినిమా అనేది వ్యాపారం. అయితే అతి తక్కువే సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా సినిమా ఇండస్ట్రీనే. కేవలం మూడు నుండి నాలుగు శాతం సక్సెస్ రేట్ ఉంది మనకు. 2019 కూడా అందుకు మినహాయింపేమి కాదు. ఇంకా సంవత్సరం పూర్తవ్వకపోయినా నవంబర్ వరకూ చూసుకుంటే ఈ ఏడాది సక్సెస్ అయిన చిత్రాలు డజను దాటవు. ఏడాదికి ఏడాది మారుతున్నా పరిస్థితిలో మార్పు రావట్లేదు. మహా అయితే నెలకు ఒక హిట్ మాత్రమే నమోదవుతోంది. ఆఫ్ సీజన్ అయిన ఫిబ్రవరి, నవంబర్ లలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. 2019లో మొదటి దెబ్బ సంక్రాంతికే పడింది. ఎప్పుడూ సినిమాలు హిట్ అయ్యే సంక్రాంతి సీజన్ లో ఈసారి తెలుగు సినిమా దారుణంగా విఫలమైంది. ఒకసారి 2019లో నవంబర్ దాకా రౌండప్ వేద్దాం.

జనవరి:
జనవరిలో 7 సినిమాలు విడుదలైతే ఒకే ఒక్క సినిమా హిట్టైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. జనవరి 25న విడుదలైన అఖిల్ చిత్రం Mr. మజ్ను కూడా ప్లాప్ అయింది. ఇది అఖిల్ కు హ్యాట్రిక్ పరాజయం. ఇక హిట్ అయిన సినిమాగా వెంకటేష్, వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా నిలిచింది. అందరి అంచనాలను దాటుకుని ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు రెండింతల ప్రాఫిట్స్ వచ్చాయంటే ఎంత పెద్ద విజయమో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

ఫిబ్రవరి :
ఫిబ్రవరిలో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మామూలుగానే ఫిబ్రవరి అంటే డ్రై సీజన్ గా పరిగణిస్తారు. తెలుగు సినిమాలు ఎక్కువగా ఈ కాలంలో ఆడిన చరిత్ర లేదు. ఈ నెలలో ఈ ఏడాది 10 సినిమాలు విడుదలైతే ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేదు. వైఎస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర ఓ మోస్తరుగా ఆడి పర్వాలేదనిపించింది. మిగతావన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన చిత్రాలే.

మార్చ్ :
మార్చ్ లో కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చి పడిపోయాయి. ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నెలలో 5 శుక్రవారాలు రాగా వారానికి సగటున 3 సినిమాలు కంటే ఎక్కువే విడుదలయ్యాయన్నమాట. ఇన్ని సినిమాలు విడుదలైతే హిట్లు ఎన్ని అంటే చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఒక్కటి కూడా లేదు కాబట్టి. కానీ 2 సినిమాలు మాత్రం ఎబోవ్ యావరేజ్ గా ఆడాయి.అవే కళ్యాణ్ రామ్ నటించిన 118, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్. వర్మ చిత్రానికి ఎలక్షన్ కోడ్ అడ్డొచ్చి ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోవడం పెద్ద దెబ్బ పడింది. మిగతా సినిమాల గురించి చెప్పుకోకపోవడమే మంచిది.

ఏప్రిల్ :
అప్పటిదాకా హిట్లు లేక అల్లాడిపోతున్న తెలుగు ఇండస్ట్రీకి ఈ నెల రెండు హిట్లు ఒక యావరేజ్ సినిమా పడింది. నాగ చైతన్య, సమంత కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అందుకుంది. సాయి ధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరి కూడా డీసెంట్ హిట్ స్టేటస్ అందుకుంది. ఇక నాని నటించిన జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా యావరేజ్ అనిపించుకుంది. ఈ నెలలో మొత్తం 8 సినిమాలు విడుదలయ్యాయి.

మే :
మే లో మహేష్ బాబు నటించిన మహర్షి విడుదలై బాక్స్ ఆఫీస్ కు సరికొత్త కళను తీసుకొచ్చినట్లైంది. ఈ సినిమా అంచనాలను అందుకుని సూపర్ హిట్ సాధించింది. అలాగే నెలాఖరులో విడుదలైన ఫలక్నుమా దాస్ విమర్శలు అందుకున్నా కలెక్షన్స్ తో అదరగొట్టింది.

జూన్ :
జూన్ లో కూడా 14 సినిమాలు విడుదలయ్యాయి. హిట్లు ఎప్పట్లానే తక్కువగానే నమోదయ్యాయి. జూన్ లో అన్నీ చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదలవ్వగానవీన్ పోలిశెట్టి నటించిన థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే శ్రీవిష్ణు, సత్యదేవ్ హీరోలుగా వచ్చిన బ్రోచేవారెవరురా కూడా సూపర్ హిట్ సాధించింది. ఈ రెండు సినిమాలకు లాభాలు మంచిగా వచ్చాయి. మల్లేశం సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చినా కలెక్షన్లు నామమాత్రమే. మిగతావన్నీ షెడ్ కి వెళ్లిపోయాయి.

జులై :
ఈ నెలలో 13 సినిమాలు విడుదలవ్వగా ఒక బ్లాక్ బస్టర్, ఒక హిట్, ఒక యావరేజ్ తో పర్వాలేదనిపించింది. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బయ్యర్లు అందరూ ఈ సినిమాతో పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. అలాగే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ కూడా హిట్ అయింది. ఇక సందీప్ కిషన్ నటించిన థ్రిల్లర్ నిను వీడను నీడను నేనే యావరేజ్ గా నిలిచింది.

ఆగష్టు :
ఆగస్టులో బాక్స్ ఆఫీస్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య వందల కోట్ల బిజినెస్ చేసిన ప్రభాస్ సాహో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. మొదటి రోజే టాక్ నెగటివ్ గ్గా స్ప్రెడ్ అవ్వడంతో ట్రేడ్ కోలుకోలేకపోయింది. అలాగే నాగార్జున నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కావడంతో ఆగష్టు టాలీవుడ్ కు డిజాస్టర్ అని చెప్పవచ్చు. అలాగే ఈ నెలలో వచ్చిన ఎవరు, కొబ్బరి మట్ట, రాక్షసుడు సినిమాలకు డబ్బులు మిగిలాయి. ఈ మూడూ హిట్ అయ్యాయని చెప్పవచ్చు.

సెప్టెంబర్ :
సెప్టెంబర్ లో కేవలం 8 సినిమాలే విడుదలయ్యాయి. ఇందులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ యావరేజ్ గా నిలవగా వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ అయింది. మిగతా సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్టే వెళ్లిపోయాయి.

అక్టోబర్ :
అక్టోబర్ లో 13 సినిమాలు విడుదలైనా బాక్స్ ఆఫీస్ దృష్టాంతా మెగాస్టార్ 151వ సినిమా సైరా పైనే ఉంది. సైరా నరసింహారెడ్డి భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా భారీ రేట్లకు అమ్ముడుపోవడం వల్ల హిట్ అనిపించుకోలేకపోయింది. గోపీచంద్ నటించిన చాణక్య కూడా అడ్రస్ లేకుండా గల్లంతైంది. ఈ నెల ఒక్క హిట్ కూడా నమోదవ్వకపోవడం దారుణం.

ఇక నవంబర్ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ఈ నెల కూడా ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా నమోదవ్వలేదు. అయితే డిసెంబర్ లో వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, రూలర్ ల రూపంలో మూడు డీసెంట్ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ సినిమాలు విజయం సాధించి 2019 కి టాలీవుడ్ మంచి ముగింపుని ఇస్తుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All