
బెంగాల్‌లో తృణమూల్ పాలన నికృష్టంగా ఉందంటూ ఛలో సచివాలయం పేరుతో ఆందోళనకు దిగింది కమలం దండు. కాకపోతే.. అక్కడ నిరసన శృతి మించి, గతి తప్పి హింసగా మారింది. అవతలి పక్షం కార్యకర్తల్ని దొరికినవాళ్లను దొరికినట్టు చితకబాదారు బీజేపీ కార్యకర్తలు. ఒకపార్టీ వారు మరొక పార్టీ వాళ్లను మాన్‌హ్యాండిల్ చేయడం రాజకీయాల్లో కామన్. కానీ.. ఈ కామన్ సీన్లలోకి ఖాకీల పాత్ర ఎంట్రీ ఇచ్చింది. అదుపు చెయ్యడానికి ప్రయత్నించిన ఒక కానిస్టేబుల్‌పై బీజేపీ కార్యకర్తలు చేసిన భౌతిక దాడులు… ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్సియల్ అయ్యాయి.
ఒక కాన్‌స్టబుల్‌ని ఒంటరిని చేసి… కసితీరా కొట్టి చంపేంత పని చేసిన కమలం క్యాడర్ మీద కస్సుమంటోంది తృణమూల్ పార్టీ. ఈ పాథెటిక్ వీడియోను తమ అఫీషియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి… పోలీసన్నల మీద మీకుండే ప్రేమలు ఇవేనా అంటూ ప్రశ్నిస్తోంది టీఎంసీ. రక్షాబంధన్ రోజు పోలీసులకు రాఖీలు కట్టి అనుబంధం కలుపుకున్న బీజేపీయులు… ఇప్పుడు మాత్రం అదే పోలీసుల మీద ప్రతాపం చూపుతారా… వాళ్లు చేసిన నేరమేంటి చెప్పండి… అని సూటిగా ప్రశ్నిస్తోంది తృణమూల్ పార్టీ.
ఇలా సగటు పోలీసుపై సానుభూతి కురిపిస్తూ… సెంటిమెంటల్ టచ్ ఇస్తూ కమలం పార్టీని పూర్తిగా కార్నర్ చేస్తోంది టీఎంసీ. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియోతో ఇప్పుడు బీజేపీ గొంతులో వెలక్కాయ పడ్డట్టైంది. ఛలో సచివాలయం పేరుతో కోల్‌కతాలో జరిగిన రణరంగం మొత్తం పక్కకెళ్లిపోయి… ఈ పోలీస్ వీడియో ఒక్కటే బెంగాల్‌లో కొత్త చర్చకు తావిచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే… లేటెస్ట్ టాక్ ఆఫ్‌ది బెంగాల్ ఇదే ఇప్పుడు.