
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే దిశగా జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రతో.. ఎలాంటి ఇబ్బంది కలిగినా చంద్రబాబుదే బాధ్యతన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అమరావతి రాజధానిగా ఉండదని తాము ఏనాడూ చెప్పలేదన్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా.. తమ ప్రభుత్వ విధానం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటేనని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా మూడు రాజధానులే రెఫరెండంగా 2024 ఎన్నికలకు వస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ ఐదేళ్లలో చేసిన సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళతామని తెలిపారు.
విశాఖ అభివృద్ధి వద్దని పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర వస్తున్నారంటూ ఆయన అమరావతి రైతుల మహాపాదయాత్రపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. ఇటు చంద్రబాబు అమరావతికి చేసింది ఏమీలేదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించారు. అమరావతి కోసం గుంటూరు, విజయవాడకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని మోసం చేశారు. 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి.
కొంతమంది పాదయాత్ర అంటున్నారు. అది విశాఖపై దండయాత్ర. పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరు. పాదయాత్రతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చంద్రబాబే కారణం. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరని మంత్రి అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పెడతాం. బిల్లు పెట్టిన తర్వాత ఎప్పుడైనా సీఎం విశాఖ రావొచ్చని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.