
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాపకింద నీరులా వ్యాప్తిస్తోంది. గతంతో పోలిస్తే గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించే పరీస్థితులు లేవని చెబుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల్ని చిన్న చిన్నగా కఠనతరం చేయడం ప్రారంభమైంది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ అప్రమత్తమైంది.
ఇప్పటికే ప్రకటించిన తమ చిత్రాల రిలీజ్‌లని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ నెల 16న విడుదల కావాల్సిన `లవ్‌స్టోరీ` తాజా పరీస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. పరీస్థితుల్లో మార్పులు వచ్చాక మంచి రిలీజ్ డేట్ చూసుకుని ప్రకటిస్తామని మేకర్స్ తాజాగా వెల్లడించారు. తాజాగా మరో సినిమా రిలీజ్‌ని కూడా వాయిదా వేశారు ప్రొడ్యూసర్స్. అదే కంగన నటిస్తున్న `తలైవి`. దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న అన్ని భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ కారణంగా విడుదల వాయిదా వేస్తున్నామని తాజాగా ప్రకటించారు.
`ఇటీవల విడుదల చేసిన `తలైవి` ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. అందుకు రుణపడి వుంటాము. సినిమాను రూపొందించే క్రమంలో చిత్ర బృందం ఎన్నో త్యాగాలు చేసింది. అందుకు వారందరికి ధన్యవాదాలు. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. దీనికి అందరు సహకరించారు. కానీ ఇప్పుడు కోవిడ్ బాగా విస్తరిస్తోంది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. గవర్నమెంట్ నిబంధనల్ని కఠనతరం చేస్తోంది. ఇలాంటి సమయంలో మనము కూడా విరికి సహాయంగా నిలబడాలి. అందుకే 23న విడుదల కావాల్సిన `తలైవి` చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం` అని మేకర్స్ ప్రకటించారు.