
ఆసియా కప్‌లో టీమిండియా జట్టు అదరగొడుతుంది. రెండు వరుస విజయాలు సాధించి టోర్నీలో మెరుగైన స్థానంలో నిలిచింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా విజయం దక్కించుకుంది. అనంతరం రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన పసికూన హాంకాంగ్ జట్టుపై 40 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఇదిలా ఉంటే.. టోర్నీలో ఇప్పటి వరకు ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోనప్పటికీ కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉంది.
వాటిని అధిగమించకపోతే ముందు ఆడబోయే టీ20 మ్యాచుల్లో ఇబ్బందులు తప్పవు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండటం, హాంకాంగ్ మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతో రాణించడం మన జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్లుగా చెప్పవచ్చు. అయితే కేఎల్ రాహుల్ మన జట్టులో కీలక ఆటడాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న రాహుల్, మెరుగైన పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో నిరుత్సాహపరచిన రాహుల్.. హాంకాంగ్ మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఇక మొన్నటికి మొన్నహాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచులో కూడా అంతగా రాణించలేకపోయాడు.
అయితే రానున్న మ్యాచుల్లో కేఎల్ రాహుల్ పరుగులు చేయడం టీమిండియాకు చాలా అవసరమని అంటున్నారు సీనియర్ క్రికెటర్లు. ఓపెనర్ రాహుల్ మంచి స్కోర్ చేస్తే భారీ టార్గెట్‌లను సెట్ చేయవచ్చు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరుగులు చేసినా.. చేయకున్నా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ అతనికి బోలెడు మంది వీరాభిమానులున్నారు. దుబాయిలో జరుగుతున్న ఆసియా కప్ వేదికగా ఈ విషయం మరోసారి రుజువైంది.
పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో మాట్లాడేందుకు, అతడు సంతకం చేసిన జెర్సీని పొందేందుకు దాయాది దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు ఆసక్తిచూపిన విషయం తెలిసిందే. ఇక అభిమానులైతే కోహ్లీని కలిసి అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకుని మురిసిపోయారు. కోహ్లీ సైతం వారితో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగి అందరి మనసులు గెల్చుకున్నాడు. తనను ఇంతవాడిని చేసిన అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ రన్‌మెసిన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
హాంకాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం భారత జట్టు స్టేడియంలోకి వెళుతుండగా.. కోహ్లీ వీరాభిమాని అయిన ఓ బాలుడు సెక్యూరిటీ కళ్ల గప్పి విరాట్ దగ్గరకు దూసుకొచ్చాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. దీన్ని గమనించిన కోహ్లీ.. ఆ బాలుడిని వదిలేయాల్సిందిగా సూచించాడు. దీంతో సెక్యూరిటీ గార్డు ఆ బాలుడిని విడిచిపెట్టాడు. దీంతో కోహ్లీ వద్దకు పరుగున వెళ్లిన ఆ బాలుడు.. విరాట్ ఆటోగ్రాఫ్ తీసుకొని, సెల్ఫీలు దిగి తెగ సంబరపడిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ బాలుడి పట్ల కోహ్లీ ఎంతో హుందాగా ప్రవర్తించాడని ఫ్యాన్స్, నెటిజన్లు మన రన్‌మెషిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.