
కోలీవుడ్ కు చెందిన ప్రముఖ హాస్య నటుడు వివేక్ (59) కన్నుమూశారు. గురువారం మధ్యహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వివేక్ చేరిన విషయం తెలిసిందే. పరీస్థితి విషమించడంతో ఆయనని వెంటనే ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూనే ఆయన తెల్లవారు జామున 4:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
వివేక్ ఆకస్మిక మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ వెండితెరకు పరిచయం చేసిన క్రేజీ నటుల్లో వివేక్ ఒకరు. బాలచందర్ దర్శకత్వం వహించిన `మనదిల్ ఉరుది వేండం` అనే చిత్రంతో వివేక్ నటుడిగా అరంగేట్రం చేశారు.
అనంతరం ఆయన హాస్యనటుడిగా దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, సూర్య, విక్రమ్, అజిత్ నటించిన చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించారు. రజనీతో నటించిన `శివాజీ`, విక్రమ్‌తో నటించిన `అపరిచితుడు`, సూర్యతో నటించిన సింగం, సింగం 2, అజిత్ నటించిన `విశ్వాసం` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని సైతం మెప్పించారు.