
బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా హీరో ఆయుష్మాన్ ఖురానాని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టిన చిత్రం `అంధాధున్`. ఆయుష్మాన్‌తో పాటు మూడు జాతీయ పురస్కారాలు, ఫిలింఫేర్, ఇఫా, జీ పురస్కారాల్ని అందించింది. ఆయుష్మాన్ ఖురానాతో పాటు టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటింటిచిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
నితిన్ హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ మూవీలో ఎవరు నటిస్తారా? అన్నది గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కీలకమైన టబు పాత్రతో పాటు రాధికా ఆప్టే పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టబు పాత్రలో నయనతార తో పాటు పలువురి పేర్లు వినిపించాయి.
తాజాగా ఆ స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నాని అవకాశం వరించింది. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ కనిపించబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ శనివారం ప్రకటించారు. నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అత్యంత కీలకమైన టబు పాత్రని తమన్నా రక్తి కట్టించగలదా? అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. `సైరా నరసింహారెడ్డి`లో అవంతికగా బరువైన పాత్రని పరిణతిగల నటిగా నటించి రక్తి కట్టించిన తమన్నా `అంధాధున్` రీమేక్‌లో టబు పాత్రని కూడా రక్తికట్టించగలదని అంటున్నారు.