Homeటాప్ స్టోరీస్సైరా అన్ని విధాల ఫెయిల్ అయినట్టేనా?

సైరా అన్ని విధాల ఫెయిల్ అయినట్టేనా?

Syeraa Movie Poster
Syeraa Movie Poster

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో 150 చిత్రాలు చేసాడు. సైరాతో కలుపుకుంటే కౌంట్ 151కి చేరుతుంది. ఇదేమి మాములు ఫీట్ కాదు. ఈ 151 సినిమాల కెరీర్ లో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. కొన్ని సినిమాలు క్లాసిక్స్ గా కూడా మిగిలాయి. అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేసాడు చిరంజీవి. అయితే తన కెరీర్ లో భారీ కాన్వాస్ లో సినిమా లేదన్న వెలితి చిరుకు అలాగే ఉండిపోయింది. చాలా మంది రచయితలు, దర్శకులు ఇలా భారీ కాన్వాస్ తో సినిమా చేయాలన్న ప్రపోజల్ తో ఇంతకుముందు కూడా చిరంజీవి వద్దకు వచ్చారు.

- Advertisement -

అయితే అప్పట్లో అంత బడ్జెట్ పెట్టే నిర్మాత లేకపోవడంతో చిరంజీవికి ధైర్యం సరిపోలేదు. అప్పట్లో తెలుగు మార్కెట్ కూడా చాలా పరిమితమైంది. ఆ సమయంలో ఇలాంటి ప్రయత్నాలు కూడా చాలా రిస్క్. అయితే బాహుబలి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. భారీ కలలు మనం కూడా కనొచ్చని, సరిగ్గా ప్రయత్నిస్తే మనం కూడా వందల కోట్ల బడ్జెట్ తో భారీ కాన్వాస్ తో సినిమా తీయగలమని నిరూపించిన సినిమా ఇది. బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అన్న బిజినెస్ లెక్కల్ని పక్కనపెట్టి చూస్తే చాలా మంది సినిమా వాళ్లకు కొత్తరకమైన ధైర్యాన్నిచ్చింది. భారీగా ప్రయత్నించొచ్చని, మార్కెట్ పరిధి గురించి ఆలోచించి ఆగిపోనవసరం లేదని చాటి చెప్పింది.

చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించారు కూడా. బాహుబలితో తెలుగు ఇండస్ట్రీ రూపు రేఖలు మారిపోయాయని అంటుంటారు. బాహుబలి చూసిన తర్వాత చిరంజీవికి కూడా భారీ కాన్వాస్ లో సినిమా చేయాలన్న కోరిక కలిగింది. ఇదేమి తప్పు కూడా కాదు. అందుకే తన దగ్గర 12 ఏళ్లుగా ఆగిపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా చేయాలని సంకల్పించాడు. తండ్రి కోరికను నెరవేర్చడానికి కొడుకు రామ్ చరణ్ ముందుకొచ్చాడు. సైరా నరసింహారెడ్డి కథను తెరకెక్కించడానికి దాదాపు 250 కోట్లు పెట్టుబడి పెట్టాడు. మొత్తం ఐదు భాషల్లో చేయాలని నిర్ణయించుకున్నారు.

సైరా నరసింహారెడ్డి మంచి సినిమానే. భారీ కాన్వాస్ ను అద్భుతంగా ప్రెజంట్ చేసిన సినిమానే. 250 కోట్ల పెట్టుబడికి అదే రేంజ్ లో బిజినెస్ జరిగిన సినిమా. అయితే రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. తెలుగు రాష్ట్రాల అవతల సైరా డిజాస్టర్. ఇందులో మరో మాటకు తావు లేదు. ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా భారీగా నష్టాలు మూటగట్టుకుంది సైరా. సరే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైరా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల వరకూ సైరా కలెక్షన్స్ బాగున్నాయి. 100 కోట్ల షేర్ దాటింది. నాన్ బాహుబలి రికార్డును కూడా నెలకొల్పింది. అంతా బానే ఉంది. కానీ ఇక్కడ కూడా సైరా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ రకంగా చూస్తే ఇక్కడ కూడా సైరా ప్లాప్ కిందే లెక్క. పోనీ కలెక్షన్స్ ను పక్కనపెట్టి క్లాసిక్ గా దీన్ని పరిగణిద్దామన్నా చిరంజీవి నటనాపరంగా ఇంతకన్నా అద్భుతంగా పండించిన పాత్రలెన్నో ఉన్నాయి. సినిమా బాగుంది కానీ యుద్ధ సన్నివేశాలు ఎక్కువ బాహుబలి తరహాలో ఉన్నాయన్న విమర్శ వచ్చింది. ఇలా అన్ని ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకుంటే సైరా మొదలుపెట్టిన ఉద్దేశం అన్ని రకాలుగా చేరుకోలేదనే అనుకోవాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts