
నటీనటులు: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, సాయికుమార్, రావు రమేష్, మురళీశర్మ, నరేష్, ఆమని, సప్తగిరి, సత్య తదితరులు నటించారు.
దర్శకత్వం: బి. కిషోర్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
సంగీతం : మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ : జె.యువరాజ్
ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్
ప్రొడక్షన్ కంపనీ : 14 రీల్స్ ప్లస్
రిలీజ్ డేట్ : 11- 03- 2021
రేటింగ్ : 3/5
కథా బలమున్న చిత్రాల్ని ఎంచుకుంటూ కొత్త తరహా చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ హీరో శర్వానంద్. తాజాగా ఆయన రైతు కొడుకు ఎందుకు రైతు కావాలనుకోవడం లేదని సూటిగా ప్రశ్నించే కథతో `శ్రీకారం` చిత్రాన్ని చేశారు. మరి ఈ మూవీ ఆశించిన స్థాయిలోనే వుందా? శర్వా యువ రైతుగా ఆకట్టుకున్నారా? .. షార్ట్ ఫిల్మ్ తో దర్శకుడిగా అవకాశం దక్కించుకున్న బి. కిషోర్ మేకర్స్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
కార్తీక్ (శర్వానంద్). ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి కేశవులు (రావు రమేష్) చేసిన అప్పుల్ని తీరుస్తుంటాడు. తను వర్క్ చేసే కంపనీలో అందమైన అమ్మాయి చైత్ర (ప్రియాంక అరుళ్ మోహన్) మనసు దోచేస్తాడు. ఇంతలో యూఎస్ బ్రాంచ్‌కి మేనేజర్‌గా కార్తీక్‌కి ప్రమోషన్ వస్తుంది. అయితే ఆ ప్రమోషన్‌ని కాదని ఉద్యోగం మానేస్తానని, మట్టి తొక్కుతూ వ్యవసాయం చేస్తానని చెబుతాడు. ఉద్యోగం వదిలేసి తన సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలను ఇంటికి వచ్చేస్తాడు. అయితే తన కొడుకు అమెరికా వెళ్లిపోతున్నాడని గర్వంగా చెప్పుకున్న కేశవులు తన కొడుకు ఇంటికి తిరిగి వస్తే ఎలా స్పందించాడు? .. వ్యవసాయం చేస్తానంటే కేశవులు ఎలా రియాక్ట్ అయ్యాడు? .. కార్తీక్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకోవడం వెనకున్న కారణం ఏంటీ? .. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
హీరో శర్వానంద్ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కార్తీక్ పాత్రలో ఒదిగిపోయాడు. శర్వా చుట్టే కథ నడుస్తుంది. భావోద్వేగాలు పండించడంలోనూ, బరువైన పాత్రలో నటించడంలోనూ శర్వా తన ప్రత్యేకతని మరోసారి చాటుకున్నారు. రావు రమేష్, సాయికుమర్, నరేష్ లు బరువైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. కథని కీలక మలుపు తిప్పే ఏకాంబరంగా ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో సాయికుమార్ ఆకట్టుకున్నారు. సత్య కామెడీ ఆకట్టుకుంటుంది. ప్రియాంక అరుళ్ మోహన్ అందంగా నటించి అలరించింది.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. యువరాజ్ అందించిన విజువల్స్, కెమెరా పనితనం, మిక్కీ. జె.మేయర్ సంగీతం, బుర్రా సాయి మాధవ్ సంభాషణలు చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. పాటలు , వాటిని చిత్రీకరించిన తీరు అర్థవంతంగా సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. దర్శకుడు కిషక్షర్ కథని నిజాయితీగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. కమర్షియల్ అంశాలని కావాలని ఎక్కడా జోడించకుండా నిజాయితీగా అనుకున్న కథని జనరంజకంగా చెప్పే ప్రయత్నం చేశారు. 14 రీల్స్ ప్లస్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.
తీర్పు:
నెరేషన్ పరంగా సెకండ్ హాఫ్‌లో కొంత స్లో అనిపించినా ఎక్కడా ఆ ఫీల్‌ని కలిగించకుండా దర్శకుడు కిషక్షర్ సినిమాని ముదుకు నడిపించాడు. శర్వానంద్ నటన, రావు రమేష్ డైలాగ్‌లు, సాయి కుమార్ విలక్షణమైన విలనిజం.. వ్యవసాయంలో రాణిస్తున్న విద్యావంతుల స్ఫూర్తి వంతమైన కథలని ప్రేరణగా తీసుకుని చేసిన సినిమా ఇది. వ్యవసాయం వైపు యువత కూడా చూడాలని, దీన్ని కూడా ఓ కెరీర్‌గా తీసుకోవాలని ఈ మూవీ ద్వారా చెప్పారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ని కూడా ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.