
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉన్నాయని, స్వల్పంగా దగ్గు, జ్వరం ఉందని, అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఇటీవల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. దీంతో బాలూ అభిమానులు భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత బాలూ తనయుడు ఎస్పీ చరణ్ మరో వీడియోని రిలీజ్ చేశాడు. నాన్న ఆరోగ్యంగానే వున్నారని, వెంటిలేటర్‌పై వున్నా స్పందిస్తున్నారని వెల్లడించారు.
ఆ తరువాతే సీన్ మారింది. బాలూ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా గత గురువారం రాత్రి క్షీణించిందని, ఆయనను వెంటనే ఐసీయూకు తరలించామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్‌థితి ఆందోళన కరంగానే వుందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. `నాన్న ఆరోగ్యం ఇంకా ఆందోళన కరంగానే వుంది. ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేను తరచు అప్‌డేట్ ఇవ్వడం లేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయనే నమ్మకముంది. నాన్న ఆరోగ్యం కుదుటపడాలని సామూహిక ప్రార్థనలు చేస్తున్న చిత్ర పరిశ్రమకు, సంగీత విభాగానికి చెందిన వారికి, దేశ ప్రజలకు, మాపై అభిమానం చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞులం` అని ఎస్పీ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు.