
ప్రముఖ గాయకుడు, నటుడు బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉన్నట్టుండి ఆయన గురువారం రాత్రి అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయనను ఆసుపత్రి వర్గాలు ఐసీయూకు తరలించినట్టు ఈ రోజు విడుదల చేసిన బులిటెన్‌లో ప్రకటించారు.
ఈ నెల 5న తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు బయటపడ్డాయని, జ్వరం, దగ్గుతో గత రెండు రోజులుగా బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఓ వీడియో సందేశాన్ని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్యం నిలకడగా వుందని, తనని అభిమానించే వారు ఆందోళన చెందాల్సిన పని లేదని కూడా స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి మార్చామని, ప్రత్యేక వైద్య బృందం ఆయనని పర్యవేక్షిస్తోందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో బాలు అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు.