
డా. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక `దొరసాని` చిత్రంతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే దొరసాని పాత్రలో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తనదైన నటనతో ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ మలయాళ రీమేక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించబోతున్నారు.
ఇటీవల మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ప్రేమకథా చిత్రం `కప్పెల`. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఆయన రీమేక్ చేయబోతున్నారు. ఈ ఏడాది చివరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శివాత్మిక అయితే బాగుంటుందని సూర్యదేవర నాగవంశీ భావించి ఆమెని ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది.
ఇటీవలే ఆమెకు కథ కూడా వినిపించారట. పాత్ర నచ్చడంతో శివాత్మిక ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మలయాళ చిత్రంలో నటించిన శ్రీనాథ్, రోషన్ మాథ్యూస్ పాత్రల కోసం విశ్వక్‌సేన్, నవీన్‌చంద్రలని నిర్మాత సంప్రదించినట్టు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని చెబుతున్నారు. శివాత్మిక ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న `రంగమార్తాండ`లో నటిస్తోంది.