
బాలీవుడ్ సూపర్ స్టార్ ఓ పక్క వివాదాలు.. మరో పక్క వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తన ఫామ్ హౌస్ సమీపంలో వున్న గ్రామాల ప్రజలకు నిత్యావస వస్తువుల్ని అందించి గొప్ప మనసు చాటుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 14 తో పాటు మూడు సినిమాల షూటింగ్‌లతో బిజీగా వున్నారు.
ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అంతిమ్ ది ఫైనల్ ట్రూత్`. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. గడ్డం.. కళ్లకు బ్లాక్ గాగుల్స్.. చేతికి కడియం.. పఠాన్‌ల తలపాగా ధరించి స్టైల్‌గా మార్కెట్‌లోకి నడిచి వస్తున్న సల్మాన్ `అంతిమ్ ది ఫైనల్ ట్రూత్` లుక్ వైరల్ గా మారింది. ఈ వీడియోని అతని బావమరిది ఆయుష్ శర్మ షూటి చేశాడు. అతనే సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేయడంతో సల్మాన్ అంతిమ్ లుక్ వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఆయుష్ శర్మతో కలిసి నటించనున్నారు. ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ సిక్కు వ్యక్తిగా కనిపిస్తాడు. ఫస్ట్ లుక్ లో బ్లూకలర్ షర్ట్…యాష్ కలర్ ప్యాంట్.. తలపాగా కట్టుకుని కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని సీరియస్ గా నడిచి వస్తున్న సల్మాన్ తీరుని చూస్తుంటే ఈ చిత్రంలో అతని పాత్ర సీరియస్ టోన్‌లో సాగుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ `రాధే` చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క `టైగర్ 3` కూడా సెట్స్ పైనే వున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి. `కబీ ఈద్ కబీ దీపావళి` 2022 లో విడుదల కానుంది. పఠాన్, అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చద్దా` చిత్రాలలో సల్మాన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు.