
యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ ఓటిటి అప్డేట్ బయటకు వచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్ స్ట్రీమింగ్ హక్కులతో పాటు హిందీకి సంబంధించి శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇందుకుగాను జీ గ్రూప్ ఏకంగా రూ. 300 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా థియేటర్లలో వచ్చిన కనీసం 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. అంటే జూన్ రెండవ వారంలో ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే ఇంగ్లిష్, పోర్చుగీస్, కొరియన్, స్పానిష్ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.