
ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తోన్న భారీ ప్యాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం కరోనా కారణంగా ఎఫెక్ట్ అయ్యి ప్రొడక్షన్ లో డిలే అయింది. మొత్తానికి ఎలాగైతేనేమో ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీని అక్టోబర్ కు కన్ఫర్మ్ చేసారు. దసరాకు రిలీజ్ ఉంటుందని ప్రకటించినా కానీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో ఉన్న థియేటర్ల బిజినెస్ పరిస్థితి కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదలపై మొదటి నుండి అనుమానాలు ఉన్నాయి.
ఇప్పుడు వాటిని నిజం చేస్తూ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తయింది. అక్టోబర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నా కానీ ప్రపంచ మార్కెట్ లో థియేటర్ల బిజినెస్ అంత ఆశాజనకంగా లేదు. అందుకనే ఆర్ ఆర్ ఆర్ విడుదలను వాయిదా వేస్తున్నాం.
కొత్త విడుదల తేదీని పరిస్థితులు అనుకూలించినప్పుడు తప్పక విడుదల చేస్తామని తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.