
రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు. గత కొంత కాలంగా ఆమె మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2003లో వచ్చిన `జాని` తరువాత మళ్లీ ఆమె సినిమాల్లో నటించలేదు. ఇన్నేళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు రాబోంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `ఆద్య`. ఈ మూవీతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెడుతున్నారు.
డీఎస్‌కె స్క్రీన్స్, సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డీఎస్ రావు, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. రేణుదేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎం.ఆర్. కృష్ఱ మామిడాల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
విజయదశమి సందర్భంగా అదే రోజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో లాంఛనంగా చిత్ర బృందం ప్రారంభించబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు తాజాగా వెల్లడించారు. ముందు ఇదొక వెబ్ సిరీస్ మాత్రమే అని ప్రచారం జరిగినా తాజాగా సినిమా అని తేలడం, రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం దాశరధి శివేంద్ర, కథ – మాటలు ఆదిత్య భార్గవ్.