
మెగా పవర్‌స్టార్ తొలిసారి కమర్షియల్ కథానాయకుడిగా కాకుండా కేవలం ఒక నటుడిగా సుకుమార్‌కు సరెండర్ అయి నటించిన చిత్రం `రంగస్థలం`. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం నటుడిగా రామ్‌చరణ్‌కు విమర్శకుల ప్రశంసలు అందించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డుల్ని సృష్టించింది. తొలిసారి క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ తనని తాను మార్చుకుని తనలోనూ అవార్డ్ విన్నింగ్ నటుడు వున్నాడని నిరూపించిన చిత్రమిది. చెవులువినిపించని చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ నటన పలువురు విమర్శకుల్నే విస్మయానికి గురిచేసి అతని కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించిన ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది.
శనివారం చెన్నైలో సౌత్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక జరిగింది. ఇందులో `రంగస్థలం` ఐదు కేటగిరీల్లో అవార్డుల్ని సొంతం చేసుకోవడం చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగిస్తోంది. సినిమాలో చెవులు వినిపించని సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా రామ్‌చరణ్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇతర విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభని కనబరచడంతో ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్‌లో ఏకంగా ఐదు అవార్డులు దక్కాయి. దీంతో చిత్ర బృందం ఆనందోత్సహాల్లో మునిగితేలుతోంది.
కీలకమైన హీరో పాత్రలో చిట్టిబాబుగా అద్భుతమైన నటనని కనబరిచినందుకు గాను రామ్‌చరణ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. రంగమ్మత్తగా తనదైన శైలిలో పాత్రని రక్తికట్టించి ఆకట్టుకున్న అనసూయ ఉత్తమ సహయ నటిగా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. సినిమాలోని పాటలతో పాటు సినిమా మూడ్‌ని తన నేపథ్య సంగీతంలో తెరపై అద్భుతంగా ఆవిష్కరించినందుకు గానూ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా, పాటలతో తనదైన పాత్ర పోషించిన చంద్రబోస్‌కు ఉత్తమ గేయ రచయితగా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.