
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ ఈ క్రిస్మస్ కు విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ ప్రమోషన్స్ ను భిన్నంగా ప్లాన్ చేసింది. రెగ్యులర్ గా పుష్ప అప్డేట్స్ తో ప్రమోషన్స్ ను వేరే లెవెల్ కు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పుష్ప టీజర్, ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసారు.
ఇక ఇప్పుడు పుష్పలో విలన్ గా చేస్తోన్న మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. భన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్ గా కనిపించనున్నాడు ఫహద్. దీనికోసం గుండుతో దర్శనమిస్తున్నాడు. భయంకరమైన విలన్ గా ఈ చిత్రంలో ఫహద్ నటన ఉంటుందని ఇప్పటికే టీమ్ చెబుతోంది. ఇదే ఫహద్ కు తొలి తెలుగు చిత్రం.
రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.