
దేశంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. సెకండ్ వేవ్ ప్రమాదకర స్థాయికి చేరింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. సెలబ్రిటీలు సైతం దీని ధాటికి పట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా మరో నిర్మాత, నటి మాలాశ్రీ భర్త కరోనా కారణంగా మృతిచెందడం కన్నడ నాట విషాదాన్ని నింపింది. నిర్మాత రాము (52) సోమవారం కరోనాతో మరణించారు.
వారం రోజుల క్రితం రాముకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తమకూరు జిల్లా కుణిగల్‌కు చెందిన రాము గత కొన్నేళ్లుగా కన్నడ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. `గోలీబార్` సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు.
ఏకె 47, లాకప్ డెత్, కలాసిపాల్య వంటి చిత్రాలు నిర్మించి భారీ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ మాలాశ్రీని వివాహం చేసుకున్న రాముకు ఓ కుమారుడు, ఓ కూతురు వున్నారు. రాము మరణ వార్త విని కన్నడ సినీ వర్గాలే కాకుండా తెలుగు, తమిళ చిత్ర వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.