
`శతమానం భవతి` చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు దర్శకుడు వేగేశ్న సతీష్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కోతి కొమ్మచ్చి`. మేఘాంశ్శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్దికుమార్, మేఘ చౌదరి హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీకి సంబంధించిన 2డీ యానిమేషన్ థీమ్ సాంగ్‌ని నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు.
అనూప్ రూబెన్స్ సంగీతం, శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ `ఈ మూవీ మొదటి థీమ్ సాంగ్‌ని మా రాజు గారు రిలీజ్ చేయడం ఆనందంగా వుంది. కథలోని మంచి సందర్భంలో వచ్చే ఈ పాటని 2డీ యానిమేషన్‌లో రిలీజ్ చేస్తే బాగుంటుదని ఇలా ప్లాన్ చేశాం. అనూప్ రూబెన్స్ సంగీతం, శ్రీమణి సాహిత్యం ఈ పాటని అందరికి చేరువయ్యేలా చేశాయి. ఈ పాటకు హీరో, హీరోయిన్‌లు డ్యాన్స్ చేసినప్పటికీ థీమ్‌కు తగ్గట్టుగా యానిమేషన్‌లో కోతులతో డ్యాన్స్ చేయించాం. ఇది పిల్లల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో వున్నాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ కుటుంబ మంతా కలిసి చూసేలా సినిమాని తెరకెక్కించాం` అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ `ఈ రోజు సినిమాలోని థీమ్ సాంగ్‌తో ప్రమోషన్ స్టార్ట్ చేశాం. ఈ సాంగ్ సినిమాలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందని భావిస్తున్నాం. ఈ పాటకు మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కి అలాగే శ్రీమణిగారికి ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వెంటనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం` అన్నారు.