
కెజిఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పైకి అందరి దృష్టి మళ్లేలా చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మనకు బాహుబలి ఎలాగో, కన్నడ వాళ్లకు కెజిఎఫ్ అలా ప్రతిష్టాత్మక చిత్రంగా మిగిలిపోయింది. ఆ సినిమా భారీతనం, ప్రశాంత్ నీల్ హ్యాండిల్ చేసిన విధానం, హీరోను ప్రెజంట్ చేసిన తీరు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సెటప్ అంతా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసాయి. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా అన్ని చోట్లా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కు కొనసాగింపుగా కెజిఎఫ్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. వచ్చే వేసవికి ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ప్రమోషన్స్ కు మరో రెండు నెలలు వేసుకుని సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనుకుంటున్నారు.
ఇది పక్కన పెడితే టాలెంట్ ఎక్కడుంటే అక్కడ మనవాళ్ళు వాలిపోతారు. కెజిఎఫ్ విడుదలైన వెంటనే ప్రశాంత్ నీల్ పై మన టాప్ హీరోల దృష్టి పడింది. దాదాపు అందరి నుండి తమకేమైనా సూట్ అయ్యే కథ ఉందా అంటూ వాకబు చేయించడం మొదలుపెట్టారు. ప్రశాంత్ నీల్ కూడా తక్కువ వాడేమి కాదు. కన్నడ కంటే తెలుగు ఇండస్ట్రీ అయితే తనకు ఎక్స్పోజర్ బాగుంటుంది, పైగా కన్నడలో కూడా విడుదల చేసుకోవచ్చు అనుకుని వాకబు చేసిన అందరికీ ఎస్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ఇలా ముగ్గురితోనూ ప్రశాంత్ టచ్ లోనే ఉన్నాడట. నెల క్రితమే హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ను కలిసి దాదాపు గంట కలిసి వెళ్ళాడు. అంతకు ముందు కూడా మహేష్ తో ఇలాంటి మీటింగే జరిగింది. అసలు మహేష్ బాబు 27వ సినిమా ప్రశాంత్ నీల్ తోనే ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.
ప్రస్తుతానికి ఈ వార్తలపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా తాజాగా మరో రూమర్ మొదలైంది. ప్రశాంత్ నీల్ ఈ ముగ్గురు హీరోలతోనూ సినిమాలు చేసే అవకాశం ఉందిట. ముందుగా ఎన్టీఆర్ తో, తర్వాత మహేష్ తో, ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉంటుందన్నది ప్రాధమికంగా తెలిసింది. మైత్రి వాళ్ళ దగ్గర నుండి ప్రశాంత్ నీల్ అడ్వాన్స్ పుచ్చేసుకున్నాడు కూడా. మరి మైత్రి వాళ్లతో ప్రశాంత్ చేయబోయే సినిమాలో హీరో ఎవరో తెలీదు. అలాగే మిగతా ఇద్దరు హీరోలతో చేసే సినిమాలకు కూడా నిర్మాతలు ఎవరన్నది తేలాల్సి ఉంది.
అయితే ప్రశాంత్ నీల్ వర్కింగ్ తీరు బట్టి చూస్తే సినిమాకు సినిమాకు మధ్య కనీసం ఏడాది గ్యాప్ తీసుకుంటాడు. అంటే ఎన్టీఆర్ సినిమా మొదలవ్వాలంటే అది 2021లోనే సాధ్యమవుతుంది. ఇక ఈ ముగ్గురితో సినిమాలు పూర్తి చేయాలంటే ఒక ఆరేళ్ళు వేసుకోవాల్సిందే. అయితే ఇదంతా జరిగే పనేనా అన్నది అసలు ప్రశ్న. చూస్తుంటే ఇవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయినా ఆశ్చర్యం లేదు. మరి కెజిఎఫ్ 2 విడుదలైతే కానీ ప్రశాంత్ నీల్ తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.