
రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తన 20వ చిత్ర షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోన్న విషయం తెల్సిందే. కరోనా వైరస్ తో టాలీవుడ్ మొత్తం షట్ డౌన్ మోడ్ లోకి వెళ్ళిపోతే ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం దీన్నీ లెక్క చేయకుండా జార్జియాలో షూటింగ్ ను కానిస్తూ వచ్చారు. అక్కడ ఒక ఛేజ్ సీక్వెన్స్ ను హీరోయిన్ తో ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ కు షూట్ చేసారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి భయానకంగా మారుతుండడంతో ప్రభాస్ అండ్ టీమ్ కూడా షూట్ ను అర్ధాంతరంగా ముగించక తప్పలేదు. దీని వల్ల నిర్మాతకు చాలా నష్టమైనా కూడా కాస్ట్ అండ్ క్రూ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ అండ్ కో ఇప్పుడు హైదరాబాద్ చేరుకోనున్నారు. మరి వచ్చిన తర్వాత వీరికి కూడా కరోనా టెస్ట్ లు చేస్తారేమో చూడాలి.
ఇక దర్శకుడు జార్జియా షెడ్యూల్ పూర్తయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. తమ షూటింగ్ సజావుగా సాగడానికి సహకరించిన వారికి కృతఙ్ఞతలు చెబుతూనే ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషకరమైన విషయాన్ని తెలిపాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ త్వరలోనే వస్తుందని చెప్పాడు. గత కొద్ది రోజులుగా ప్రభాస్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఉగాదికి వస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దర్శకుడు రాధా కృష్ణ కుమార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉగాదికి ప్రభాస్20 ఫస్ట్ లుక్ రావడం ఖాయమైనట్లే.
ఈ చిత్రానికి ఓ డియర్ లేదా రాధే శ్యామ్ అనే టైటిల్స్ లో ఒకటి కన్ఫర్మ్ చేయనున్నారు. పూజ హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. జార్జియా షెడ్యూల్ తో కలిపి ఇప్పటివరకూ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్ గత చిత్రం సాహో నిరాశపరిచిన నేపథ్యంలో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ప్రభాస్ పట్టుదలగా ఉన్నాడు.