
స్టార్ హీరో అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఆయనపై అదిలాబాద్ జిల్లా నేరేడి గొండ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ రైజ్ కావడం సంచలనంగా మారింది. ఇటీవల బన్నీ `పుష్ప` షూటింగ్ కోసం అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బన్నీతో పాటు చిత్ర బృందం కోవిడ్ నిబంధనల్ని పాటించలేదని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు కేసు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు అధికారులు నిలిపివేశారు. అయినా అల్లు అర్జున్‌తో సహా చిత్ర బృందం నిబంధనల్ని బేఖాతర్ చేస్తూ జలపాతాన్ని సందర్శించడం, అక్కడికి వీరి రాకని గమనించి స్థానిక యువకులు వందల సంఖ్యలో అక్కడ గుమిగూడటం, అనుమతులు లేకుండా తిప్పేశ్వర్‌లో షూటింగ్ చేశారని ఆరోపిస్తూ సమాచార హక్కు సాధన స్రవంతి ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్ రాజు నేరడిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాధమిక విచారణ అనంతరమే బన్నీ, బన్నీ టీమ్‌పై కేసు ఫైల్ చేస్తామని వెల్లడించారట. ఇదే విషయమై సంస్థ ప్రతినిధులు డీఎఫ్ ఓ ప్రభాకర్ రావుకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో కర్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారట.