
ఆంధ్రా రాబిన్ హుడ్ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోందంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ రూపొందిస్తారని ప్రచారం జరిగింది. అయితే అదీ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత ఇదే చిత్రాన్ని రానాతో చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ అదీ అక్కడే ఆగిపోయింది. నాని అయితే ఈ పాత్రకు బాగుంటుందని, ఈ చిత్రంలో నటించడానికి నాని ఆసక్తి చూపిస్తున్నారని ఫిలిం సర్కిల్స్‌లో ఓ వార్త షికారు చేసింది కూడా.
తాజాగా అదే కథ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ దగ్గరకు వచ్చిందని తెలుస్తోంది. ఈ పాత్రకు పవన్ అయితేనే స్పాన్ వుంటుందని, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. పవన్‌కు గన్స్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఈ సినిమా పవన్ ఇష్టపడటానికి ఓ కారణంగా చెబుతున్నారు. ఇటీవలే ఈ చిత్ర కథని క్రిష్ హీరో పవన్‌కు వినిపించారని, కథ నచ్చడంతో పవన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం.
పవన్‌కల్యాణ్ ఇందులో బందిపోటు దొంగగా రనిపించనున్నారట. ప్రస్తుతం `పింక్` రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ప్రారంభం కాబోతోంది. సమంత, అంజలితో పాటు నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించనున్నారట. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తరువాత క్రిష్ సినిమా తెరపైకి వచ్చే అవకాశాలు వున్నట్టు చెబుతున్నారు.