
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్ మరోసారి సెట్ అయిన విషయం తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ కు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించనుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న విషయం తెల్సిందే.
అలాగే భవదీయుడు భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో కానీ డిసెంబర్ లో కానీ మొదలవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కొంత గందరగోళానికి కారణమైంది. వాయిదా గురించి ఒక ట్వీట్ ను షేర్ చేసాడు బండ్ల గణేష్. ఈ ట్వీట్ కొద్దిసేపటికే వైరల్ అయ్యి ఇదంతా భవదీయుడు భగత్ సింగ్ గురించే అయి ఉంటుందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావించారు.
ఈ సినిమా వాయిదా పడిందని ఫ్యాన్స్ భావించి హరీష్ శంకర్ ను కారణాలు అడగడం మొదలుపెట్టారు. విషయం తన దాకా రావడంతో హరీష్ స్పందించాడు. “అది కేవలం ఒక కోట్ మాత్రమేనని, భవదీయుడు సరైన ట్రాక్ లోనే ఉన్నాడని” హరీష్ క్లారిటీ ఇచ్చాడు.