
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కళ్యాణ్.. అనే ఆ పేరే ఒక వైబ్రేషన్.. ఆ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఓ రేంజ్ ఉంది. మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ హీరోగా.. స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నేడు ఈ పవర్ ఫుల్ వెపన్ పుట్టిన రోజు. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పవన్.
అంచలంచలుగా ఎదుగుతూ.. తనదైన మ్యానరిజంతో.. యాటిట్యూడ్ తో.. స్టైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2 వచ్చిందంటే చాలు పవన్ అభిమానులకు ఒక పండగా వచ్చినట్లే. సెప్టెంబర్ 2 వ తేదీ పవన్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో కోలాహలం నెలకొంది. పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఊరు వాడా ప్రతీ చోటా పవన్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ చట్టసభల్లో అడుగుపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఏదో ఒక పార్టీలో చేరి పార్లమెంటుకో, అసెంబ్లీకో వెళ్లే ఆలోచన వేరు, యావత్ సమాజాన్నే మార్చాలనే ఆశయాన్ని కలిగి ఉండటం వేరని అన్నారు. ఆ బలమైన ఆశయం పవన్ లో ఉందని చెప్పారు. ఎన్నికల్లో నిలబడగానే గెలిచేస్తాం, సీఎం అయిపోతామనేది తర్వాతి విషయమని అన్నారు. తన వెనుక ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా పోరాటం చేసుకుంటూ పోయేవాడే వీరుడని… పవన్ కూడా వీరుడేనని చెప్పారు. పవన్ తన వాయిస్ ను చట్టసభల ద్వారా వినిపించాలని కోరుకుంటున్నానని అన్నారు. పవన్ మనసు తనకు బాగా తెలుసని… మనకంటే ఎక్కువగా ప్రపంచం గురించి పవన్ కే తెలుసని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పపన్ గెలుపొంది, చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు.