
కొవ్వూరి సురేష్ రెడ్డి యానిమేషన్ గేమింగ్ రంగంలో సుపరిచితులైన ఆయన ఇటీవల ఫోర్బ్స్ యువ వ్యాపార వేత్తల జాబితాలోనూ ఆయన చోటు దక్కించుకున్నారు. గత 13 ఏళ్లుగా క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వున్నారు. ప్రసాల్స్ ల్యాబ్స్ సహకారంతో ఫిల్మ్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ పి19 ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఒకేసారి మూడు చిత్రాల్న నిర్మిస్తున్నారు.
ప్రొడక్షన్ నం.1కి ఆకాష్‌రెడ్డి, ప్రొడక్షన్ నం.2కి రాజ్ మాదిరాజ్, ప్రొడక్షన్ నం.3కి పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. మూడు చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లోగోలని ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ బ్యానర్‌కి రమేష్ ప్రసాద్ సమర్పకులుగా వ్యవహరించనున్నారు.
నిర్మాత సురేష్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ `గత రెండేళ్లుగా ఎన్నో కథలు విన్నాం. వరల్డ్ సినిమాకి తెలుగు సినిమా ఎంతో కంట్రీబ్యూట్ చేస్తోంది. ఎంతో మంది యంగ్ టాలెంట్ పీపుల్స్ వస్తున్నారు. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని నమ్ముతాను. వచ్చే నాలుగేళ్లలో 20 చిత్రాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడు చిత్రాల విషయానికి వస్తే ప్రదీప్ మద్దాలి చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న మొదలుపెట్టి మార్చి 15కు పూర్తి చేయాలని ప్లాన్ చేశాం. రాజ్ మాదిరాజ్ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 22 స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి పూర్తి చేస్తాం. వచ్చే వేసవిలో రిలీజ్ చేస్తాం. ఇక ఆకాష్‌రెడ్డి చిత్రాన్ని నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశాం. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాల్ని త్వరలో తెలియ జేస్తాం` అన్నారు.