
ఓ కథ సూపర్ హిట్ అయితే దానికి సీక్వెల్స్ తీయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. దాని పేరు చెప్పి క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనలో భాగంగానే సీక్వెల్స్‌ని చాలా మంది తెరపైకి తీసుకొస్తుంటారు. తాజాగా ఇదే తరహాలో ఒకే పేరుతో వరుసగా సీక్వెల్స్ చేస్తున్నారు ఓంకార్. బుల్లి తెరపై రియాలిటీ షోలతో పాపులర్ అయిన ఓంకార్ హారర్ అంశాలకి కామెడీని జోడించి తెరకెక్కించిన `రాజుగారి గది` మంచి విజయాన్ని సాధించింది.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లని రాబట్టడం, శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే రావడంతో ఈ సినిమాకు ఇప్పటి వరకు మూడు సీక్వెల్స్‌ని రూపొందించాడు. `రాజుగారి గది 2`లో అక్కినేని నాగార్జునతో పాటు సమంత, ఓంకార్ తమ్ముడు అశ్విన్ కీలక పాత్రల్లో నటించగా, ఆ తరువాత చేసిన `రాజుగారి గది 3`లో అశ్విన్, అవికా గోర్ జంటగా నటించారు. ఈ రెండు చిత్రాలు ఫరవాలేదనిపించాయి.
ఈ రెండు చిత్రాలిచ్చిన ఉత్సాహంతో ఓంకార్ `రాజుగారి గది 4`ని తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే డిస్నీప్లస్ హాట్ స్టార్ తో మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.