
సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా వుంటున్న విషయం తెలిసిందే. కరోనా విలయం మొదలైన దగ్గరి నుంచి మరీ ఎక్కువగా ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ స్పందిస్తున్న మహేష్ ఇతర హీరోల సినిమాల విషయంలోనూ, ఏదైనా సినిమా హిట్టయితే ఆ టీమ్‌ని అభినందిస్తూ ట్వీట్‌లు చేయడం కూడా ఈ మధ్య చేస్తున్నారాయన ఇదంతా బాగానే వుంది కానీ విచిత్రమో ఏమోగానీ తాజాగా ప్రకటించిన తన సినిమా SSMB28 గురించి మాత్రం మహేష్ ట్వీట్ కానీ.. రీట్వీట్ గానీ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.
మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో ఇంకా మాట్లాడలేదు (సోమవారం ఉదయం నాటికి). మహేష్ అండ్ త్రివిక్రమ్ మూడవసారి SSMB28 కోసం జతకడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని మేకర్స్ శనివారం సాయంత్రం 5:31 గంటలకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ హౌస్ హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు.
11 ఏళ్ల విరామం తరువాత త్రివిక్రమ్‌తో మహేష్ కలిసి పనిచేయబోతున్న చిత్రమిది. ఈ వార్తని ట్విట్టర్ వేదికగా మహేష్ పంచుకుంటారని ఆయన అభిమానులతో పాటు నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు కానీ మహేష్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. కానీ ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో మాత్రం SSMB28 ప్రాజెక్ట్ గురించిన వార్తని ట్వీట్ చేశారు. మరి మహేష్ ఎందుకు ట్వీట్ చేయలేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్నది మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది.