
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో విక్రమార్కుడు చిత్రానికి ఎంతో ప్రాధాన్యముంది. అసలు రవితేజ మాస్ ప్రేక్షకులను అంతలా ఆకట్టుకోవడంలో విక్రమార్కుడు ప్రత్యేక పాత్ర పోషించింది. విక్రమ్ రాథోడ్ గా పవర్ఫుల్ గా కనిపించినా, అత్తిలి సత్తిబాబుగా కామెడీతో చెలరేగిపోయినా అది రవితేజకే చెల్లింది. ఎస్ ఎస్ రాజమౌళి కమర్షియల్ విజన్ ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. 2006లో విక్రమార్కుడు విడుదలవ్వగా వెంటనే సీక్వెల్ చేద్దామనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
అయితే ఇప్పుడు ఒక నిర్మాత కోసం విక్రమార్కుడు రచయిత విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసాడు. ఎస్ ఎస్ రాజమౌళికి ఇప్పుడు విక్రమార్కుడు 2 తీసే అంత ఖాళీ లేదు. అతని స్థాయి ఇప్పుడు వీటిని దాటేసింది. అందుకే ఆ నిర్మాత సంపత్ నందికి ఈ అవకాశం ఇచ్చాడట.
రవితేజ, సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన బెంగాల్ టైగర్ ఓ మోస్తరు విజయం సాధించింది. అయితే రాజమౌళి లేడనో మరొకటో కారణం కానీ రవితేజ తనకు విక్రమార్కుడు సీక్వెల్ చేసే ఉద్దేశం లేదని చెప్పేసినట్లు టాక్. ప్రస్తుతం ఆ నిర్మాత, సంపత్ నంది కలిసి మరో మాస్ హీరోను ఇందుకోసం అన్వేషిస్తున్నారట. మరి అటు రాజమౌళి లేకుండా ఇటు రవితేజ లేకుండా అది విక్రమార్కుడు 2 ఎలా అవుతుంది, ఏమో చూద్దాం.