
థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో దక్షిణాదిలో రిలీజ్‌కు సిద్ధంగా వున్న సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టక తప్పని పరిస్థితి. ఈ రేసులో ముందు వరుసలో నిలిచిన చిత్రం `వి`. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర అనేక తర్జనభర్జనల మధ్య అమెజాన్ ప్రైమ్‌లో మొత్తానికి రిలీజ్ చేశారు. క్రేజీ చిత్రాల జాబితాలో తెలుగు నుంచి డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన తొలి చిత్రం `వి`. ఈ మూవీ తరువాత పెద్ద చిత్రాల్లో అత్యధిక భాగం ఓటీటీ బాటపడతాయని ప్రచారం జరిగింది.
అందులో `అనుష్క నటిస్తున్న `నిశ్శబ్దం` ముందు వరుసలో నిలుస్తోంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతూనే వుంది. ఆ ప్రచారాన్ని కోన వెంకట్, దర్శకుడు హేమంత్ మధుకర్ ఖండిస్తూనే వున్నారు. ఫైనల్‌గా `నిశ్శబ్దం` ఓటీటీకి డీల్ సెట్టయిందని తెలిసింది. గత కొన్ని నెలలుగా ప్రైజ్ విషయంలో తటపటాయిస్తున్న మేకర్స్ మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది.
ఇటీవల నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు కలిసి నటించిన `వి` మూవీని రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్ `నిశ్శబ్దం` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని, అనంతరం అనుష్క ప్రమోషన్స్‌ని ప్రారంభించబోతున్నారని తెలిసింది.