
ఓ నెటిజన్ తమిళ హీరో విజయ్ సేతుపతిని క్షమించమని అభ్యర్థించారు.ఆవేశంతో చేసిన వ్యాఖ్యల్ని మన్నించమని, తనని ఓ సోదరుడిలా క్షమించమని విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా `800` పేరుతో ఓ బయోపిక్‌ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ముత్తయ్య మురళీధరన్‌గా విజయ్ సేతుపతి నటించడానికి అంగీకరించారు.
ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు మూవీ టైటిల్ పోస్టర్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ కూడా రెడీ చేశారు. అయితే శ్రీలంకలో వున్న తమిళులపై అక్కడి ప్రభుత్వం, సైన్యం వివక్షని చూపిస్తోందని, ఎన్నో వేల మందిని ఊచకోత కోసిందని విమర్శిస్తూ అలాంటి దేశానికి చెందిన మురళీధరన్ బయోపిక్‌లో విజయ్‌సేతుపతి నటించడానికి వీళ్లేదని పలువురు తమిళులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
రితిక్ రాజ్ అనే నెటిజన్ ఈ మూవీలో నటిస్తే విజయ్ సేతుపతి కూతుర్ని రేప్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రితిక్ రాజ్‌పై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. విమర్శించడానికి హద్దు అనేది వుంటుందని, వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేదంటే కఠినంగా శిక్షింపబడతావని హెచ్చరించారు. దీంతో తన తప్పు తెలుసుకున్న రితిక్ రాజ్ తనని క్షమించమని విజయ్ సేతుపతిని వేడుకోవడం ఆసక్తికరంగా మారింది. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయానని, ఆ ఫ్ట్రస్ట్రేషన్‌లో అలా మాట్లాడానని, తనని ఓ తమ్ముడిలా భావించి క్షమించమని వేడుకున్నాడు.