
ముంబై మరో ఆక్రమిత కశ్మీర్‌లా మారిందని కంగన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ స్టార్స్ ఘాటుగా స్పందించారు. ముంబై నిన్ను స్టార్‌ని చేసిందని, ఎంతో మందికి జీవితాన్నిచ్చిందని, అలాంటి ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడం ఏమీ బాగాలేదని కంగనకు చురకలంటించారు. ఇదిలా వుంటే కంగనపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్ లా వుంటే ఇక్కడ అడుగు పెట్టకూడదని, ఎక్కడ వున్నావో అక్కడే వుండమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇక ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగన ముంబైలో అడుగు పెట్టకుండా కర్రలతో , రాడ్లతో కొట్టి చంపుతామని హెచ్చరించడం వివాదంగా మారింది. దీనిపై జాతీయ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. ఆయనను వెంటనే ముంబై పోలీసులు అరెస్ట్ చేయాలని ట్వీట్ చేశారు.
అతని వ్యాఖ్యల్ని ముంబై పోలీసులు సుమోటోగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కంగన మాత్రం ఈ బెదిరింపులకు బెదరడం లేదు. ఈ నెల 9న ముంబైలో అడుగుపెడతానని, దమ్ముంటే తనని అడ్డుకోవాలని సవాల్ చేసింది. దీంతో పరిస్థితి ఉద్రక్తంగా మారే ప్రమాదం వుందని రేఖా శర్మ అభిప్రాయపడుతున్నారు.