
`వరుడు కావలెను.. మ్యాట్రిమోనీలలో ప్రముఖంగా వినిపించే పేరిది. తమ ముద్దుల కూతురికి నచ్చిన వరుడి కోసం అమ్మాయి తల్లిదండ్రులు `వరుడు కావలెను` అంటూ వారి వారి కమ్యూనిటీకి సంబంధించిన మ్యాట్రీమోనీల్లో ప్రకటనలు ఇస్తుంటారు. ఇదే ప్రకటనని తమ చిత్రానికి టైటిల్‌గా ఖరారు చేశారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. `పెళ్లిచూపులు` ఫేమ్ రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి `వరుడు కావలెను` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం టైటిల్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో నాగశౌర్య, రితువర్మ చాలా అందంగా కనిపిస్తున్నారు. టైటిల్ వీడియోకు విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. `వరుడు కావలెను` చిత్ర కథకు కరెక్ట్ యాప్ట్ టైటిల్ అని నిర్మాతలు తెలిపారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కల్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్ధిక్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.