
తెలుగులో దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో కీలకమైన అతిథి పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ తెలుగు హాస్య నటుడు పొట్టి వీరయ్య ఆదివారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా సూర్యపేటలోని ఫణిగిరి పొట్టి వీరయ్య స్వగ్రామం. సోమవారం ఆయన అంత్య క్రియలు జరగనున్నాయి. పొట్టి వీరయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమకు సుదీర్ఘ కాలం సేవలందించిన వీరయ్య మృతిపట్ల సానుభూతిని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఎన్నో సవాళ్లని అధిగమించి మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి తన కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్యగారి మృతి నన్నెంతగానో కలచివేసింది. ఆయన కుటుంబం సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను` అన్నారు.
గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో `సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని.. చిరంజీవిగారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్లే నేను ఈ రోజు బతుకుతున్నా` అని, సినిమాల్లో నటిస్తేనే డబ్బుల వస్తాయి తరువాత వుండవు. ఈ మధ్య నేను అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో వున్నానని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవిగారు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందించారని` పొట్టి వీరయ్య గుర్తు చేసుకున్నారు.