Homeన్యూస్Press Release : నిజ జీవితాలూ సినిమాలను ప్రభావితం చేస్తాయి- పవన్ కల్యాణ్ గారు

Press Release : నిజ జీవితాలూ సినిమాలను ప్రభావితం చేస్తాయి- పవన్ కల్యాణ్ గారు

mana cinemalu book launch
mana cinemalu book launch

చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణీ అవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కో వడం చాలా కష్టమన్నారు.

అలాంటి వ్యక్తులపట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే సినిమా వేడుకల్లో తల ఎగరేయకుండా వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటానని అన్నారు. ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప ఒక్క వాక్యం కూడా రాయలేమని ఒక ఇంగ్లీష్ కవి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి… అలాంటిది కనిపించని రక్తాన్ని చిందించి లక్షల పేజీలు రాసిన కవులు, రచయితలకు జోహార్లన్నారు. ఆ కనిపించని రక్తమే మన రక్తాన్ని మరిగించి ప్రజా సమస్యలపై మాట్లాడేలా చేస్తుందని అన్నారు.

- Advertisement -

మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు శ్రీ తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు – చరిత్ర – పరిణామం’ పుస్తకాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ రావి కొండల రావు, సినీ పాత్రికేయుడు డా.రెంటాల జయదేవ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “అన్ని మైత్రిల కంటే సాహిత్య మైత్రీ చాల గొప్పదని సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర గారు ఒక పుస్తకం మీద రాసిచ్చారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. బందోపాధ్యాయ గారు రాసిన వనవాసి అనే పుస్తకం నన్ను ప్రకృతి ప్రేమికుడిగా మార్చేసింది. అలాంటి పుస్తకాన్ని శ్రీ తనికెళ్ళ భరణి గారు గిఫ్ట్ గా ఇచ్చినపుడు గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయినదాని కంటే ఎక్కువ ఆనందం కలిగింది. శ్రీ గుడిపాటి వెంకట చలం గారు మైదానం పుస్తకం రాశారని తెలుసుగానీ, మాలపిల్ల సినిమాకు కూడా ఆయన రచయితని ఈ పుస్తకం చూసే వరకు నాకు తెలియదు. ఇలాంటి ఎన్నో తెలియని విషయాలు తెలిస్తే వారిపై గౌరవం పెరుగుతుంది.

తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారు. బాహుబలి వంటి సినిమాలు వచ్చినాగానీ, ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదు. అదిగానీ మనం అర్ధం చేసుకోగలిగితే చాలా గొప్ప సినిమాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం. అలా తీయాలంటే ఇలాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. ముందుగా ఇలాంటి పుస్తకాన్ని రాసిన సీనియర్ పాత్రికేయులు శ్రీ తెలకపల్లి రవి గారికి అభినందనలు. రెండేళ్లపాటు శ్రమించి ఈ పుస్తకాన్ని మన ముందుకు తెచ్చారు. ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషాన్ని కలుగచేస్తుంది.

జానీ సినిమా ఎందుకు ఆడలేదో అందరి కంటే కూడా నాకే బాగా తెలుసు. కమర్షియల్ యాంగిల్ లో పడి అనుకున్న కథను తెరకెక్కించలేకపోయాను. పరుచూరి సోదరుల గొప్పతనం ఏంటంటే ఒక సామాజిక సమస్యను కమర్షియల్ విలువలు ఉంటూనే మనం ప్రభావితం అయ్యేలా రాయగలరు. అలాంటి రచన శక్తి అందరికి రాదు. అదొక అరుదైన కళ. సావిత్రి గారు, ఎస్వీ రంగారావు గారు ఎవరో ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియదు. సావిత్రిగారి బయోపిక్ తీస్తేనేగానీ ఆమె సామర్ధ్యం, కష్టాన్ని మనం గుర్తించలేకపోయాం. సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో.

నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయి. అలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావడం నిజంగా ఆనందం కలిగించింది. వారి గొప్పతనం తెలకపల్లి రవి గారు లాంటి సంపాదకులు పదేపదే మనకు చెప్పడం వల్ల చాలా మందిలో ప్రేరణ కలిగి అలాంటి సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలతోపాటు చాలా విలువలు ఉన్న సినిమాలు ముందు ముందు చాలా రావాలి.

నా సినిమాల్లో ఎన్నో కమర్షియల్ హంగులు ఉన్నా సమాజానికి ఉపయోగపడే మంచిని చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేశాను. మంచి సినిమాలు ఎవరు చేసినా ప్రేమించేవాడిని, ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు ముందు ముందు ఇంకా రావాలి, తెలుగు సినిమా చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లాలి. చరిత్రను ఇలా పుస్తకాల్లో నిక్షిప్తం చేయడానికి ఒక కమిటీ ఉంటే దానిని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాన”ని హామీ ఇచ్చారు.

Press release by: Indian Clicks, LLC

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All