
అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `సైనైడ్`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌స్‌పై ఈ చిత్రాన్ని ప్రదీప్ నారాయణ్, కె. నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకకు చెందిన నటోరియల్ క్రిమినల్ సైనైడ్ మోహన్ ఉదంతం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు.
కీలక పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. ఇందులో 300 చిత్రాలకు పైగా నటించి పలు అవార్డుల్ని అందుకున్న మలయాళ నటుడు సిద్ధిఖీ, కన్నడలో 250 చిత్రాలకు పైగా నటించి కర్ణాటక ప్రభుత్వ పురస్కారాల్ని సొంతం చేసుకున్న నటుడు రంగాయన రఘు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రియమణి పాత్రని హిందీలో యష్‌పాల్ శర్మ పోషించనున్నారు.
జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని పలు లొకేషన్‌లతో పాటు బెంగళూరు, గోవా, మంగళూరు, మైసూర్, కూర్గ్, మడికేరి, కాసర్ గాడ్‌లలో షూటింగ్ చేయనున్నామని నిర్మాతలు ప్రదీప్ నారాయణ్, కె. నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.