
సూపర్ స్టార్ మహేష్ బాబును ఇన్నాళ్లూ ఎప్పుడు మీడియా ఇంటర్వ్యూలలో బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతూ వచ్చినా దానికి ఇంకా సమయం ఉందనో, టాలీవుడ్ లో ఇంకా చేయాల్సి చాలా ఉందనో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు తొలిసారి తన మార్కెట్ ను వేరే రాష్ట్రాల్లో విస్తరించడానికి సమయం వచ్చిందని తెలిపాడు. ఇకపై తాను కూడా ప్యాన్ ఇండియా హీరోగా మారతానని మాటిచ్చాడు.
రీసెంట్ గా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్ బాబు ఎస్ ఎస్ రాజమౌళితో సినిమాపై స్పందించాడు. మరోసారి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళితో ఉంటుందని కన్ఫర్మ్ చేసిన మహేష్, తాను ప్యాన్ ఇండియా హీరో అవ్వడానికి టైమ్ ఇదేనని అన్నాడు. రాజమౌళితో చేయబోయే సినిమా అన్ని భాషల్లో విడుదలవుతుందని, ఇంతకు మించి తాను ఇంకేమి చెప్పలేనని, రాజమౌళితో సినిమా కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు కుదురుతుండడం తనకు సంతోషంగా ఉందని అన్నాడు.
ఇన్నేళ్ల నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా అంటే అది తన ఫ్యాన్స్ వల్లే అని గుర్తుచేసుకున్నాడు మహేష్. ప్రస్తుతం సర్కారు వారి పాటలో నటిస్తోన్న మహేష్ బాబు ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను కూడా లైన్లో ఉంచాడు. సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి విడుదల కాబోతోంది. పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.