
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాలో స్టార్ కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా లీడ్ రోల్స్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మూడు నెలల క్రితం విడుదల చేసారు. ఇందులో నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ కూడా ఖైదీలుగా నటిస్తోన్న విషయాన్ని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా తెలియజేసారు. ఈ ఫస్ట్ లుక్ లో ముగ్గురూ కూడా ఖైదీ బట్టలు వేసుకున్నారు. వారి నంబర్లు కూడా 420, 210, 840 అని ఉండడం ఫస్ట్ లుక్ రిలీజ్ అప్పుడు క్రేజీ థాట్ అనిపించింది.
జాతి రత్నాలు చిత్రం ద్వారా నాగ్ అశ్విన్ నిర్మాతగా మారుతున్న విషయం తెల్సిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో అందరి మన్ననలు అందుకున్న అశ్విన్, స్వప్న సినిమా బ్యానర్ పై జాతి రత్నాలు చిత్రాన్ని తెరకెక్కిస్తుండడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహానటిలో సావిత్రమ్మ పాత్రలో జీవించేసిన కీర్తి సురేష్, జాతి రత్నాలులో కీలక పాత్రలో గెస్ట్ రోల్ చేయనుందని తెలుస్తోంది. అది కథను మలుపు తిప్పే పాత్రని అంటున్నారు.
పిట్టగోడ చిత్రాన్ని తెరకెక్కించిన అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జాతి రత్నాలు సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.