
భారీ చిత్రాల దర్శకుడిగా జేజేలు అందుకున్న శంకర్ గత కొంత కాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల `అన్నియన్` హిందీ రీమేక్ హక్కుల వివాదంలో చిక్కుకున్న ఆయనపై తాజాగా లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. దర్శకుడు శంకర్ `ఇండియన్ 2` చిత్రాన్ని పూర్తి చేయకుండా ఇతర సినిమాలకు దర్శకత్వం వహించకుండా నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో శంకర్‌పై పిటీషన్ వేసింది లైకా సంస్థ.
ఈ సందర్భంగా ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఈ సమస్యని మీరే పరిష్కరించుకోండని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా `ఇండియన్ 2` చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు క్రేన్ విరిగిపడటంతో చిత్ర యూనిట్ సిబ్బందికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తరురవాత ఏశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.
నవంబర్ నుంచి సినిమా షూటింగ్‌లకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో వరుసగా భారీ చిత్రాల నుంచి చిన్న చిత్రాల షూటింగ్ లు మొదలయ్యాయి. కొన్ని పూర్తయి విడుదలయ్యాయి కూడా. అయితే శంకర్ మాత్రం `ఇండియన్ 2` షూటింగ్‌ని పునః ప్రారంభించకుండా రామ్‌చరణ్‌తో దిల్ రాజు నిర్మించబోయే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాకుండా `అన్నియన్` రీమేక్‌ని కూడా ప్రకటించడంతో లైకా శంకర్‌పై లీగల్ యాక్షన్‌కి సిద్ధపడింది. శంకర్ మాత్రం తాను `ఇండియన్ 2`ని వదిలేయడం లేదని, బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని పూర్తి చేస్తానని, ఇటీవల చనిపోయిన వివేక్ పాత్రకు సంబంధించి రీ షూట్‌లు చేయాలని వెల్లడించారు.