
దేశ ద్రోహం కింద ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం `రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్`. హీరో ఆర్. మాధవన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మాధవన్‌కి జోడీగా సిమ్రాన్ నటిస్తోంది. మాధవన్‌తో కలిసి వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ని స్టార్ హీరో మహేష్ విడుదల చేశారు.
నంబి నారాయణన్ పాత్ర పోషిస్తున్న మాధవన్ ని సూర్య ఇంటర్వ్యూ చేస్తున్న విజువల్స్‌తో ట్రైలర్ మొదలైంది. సూర్య పోషించిన అతిథి పాత్రని హిందీతో షారుఖ్‌ఖాన్ పోషించారు. `నాకు జరిగింది మళ్లీ ఈ దేశంలో ఎవరికీ జరక్కూడదు… అందరూ అరవై డెబ్భై టన్నుల ఇంజిన్‌ని తయారు చేస్తుంటే మనం 600 కిలోలతో లక్కపిడకలతో ఆడుకుంటున్నాం. ఇది రాకెట్రీ కాదు సర్ పపెట్రీ… అంటూ మాధవన్ చెబుతున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
`ఓ వీధి కుక్కని కొట్టి చంపాలంటే దానికి పిచ్చి అనే పట్టం కడితే సరిపోతుంది. అదే విధంగా ఒక మనిషిని తలెత్తకుండా చేయాలంటే దేశ ద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది` అంటూ మాధవన్‌ని ఇంటర్వ్యూ చేస్తున్న సూర్య చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నంబి నారాయణన్‌పై దేశ ద్రోహి అన్న ముద్ర ఎందుకు వేశారు? ఎవరు వేశారు? దీని వెనక ఏం జరిగింది? అన్నదే ఇందులో ఆసక్తికరం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయబోతున్నారు.