
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ స్టోరీ ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడి మొత్తానికి ఈ నెలలో విడుదలవుతోంది. లవ్ స్టోరీ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేసారు. ఈ నేపథ్యంలో ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.
తెలంగాణ రూరల్ ప్రాంతాల నుండి వచ్చిన ఇద్దరు యువతీయువకులు నిరుద్యోగం కారణంగా ఎదుర్కొన్న కష్టాలు, వాటిని ఎలా దాటారు, వారి ప్రేమ, దాన్ని గెలిపించుకోవడానికి పడే పాట్లు… ఇలా చాలా హృద్యంగా ట్రైలర్ ఉంది. మొత్తంగా ట్రైలర్ అంతటా శేఖర్ కమ్ముల మార్క్ ఉంది. పాత్రలన్నీ కూడా తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నాయి.
నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ సిహెచ్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. సారంగా దరియా, ఏ పిల్లా, నీ చిత్రం చూసి పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను సాధించాయి.
