
కొన్ని దశాబ్దాల పాటు తన గానామృతంతో ఓలలాడించిన ఆ గొంతు మూగబోయింది. గత 40 రోజులగా తీవ్ర అనారోగ్యంతో పోరాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానుల్ని శోక సంద్రంలో ముంచేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. స్వల్ప కరోనా లక్షణాలతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:04 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. తనదైన శైలి గాత్రంతో కోట్లాది సంగీత ప్రియుల్ని అలరించిన సంగీత సమ్రాట్ మరణ వార్త యావత్ ప్రపంచాన్ని శోక సంద్రంలో ముంచేసింది.
సంగీత ప్రపంచంలో ఎదురులేని గాంన గంధర్వుడిగా పేరు తెచ్చుకుని గానామృతాన్ని పంచడంలో తనకు తానే సాటి అనిపించికున్న బాలు మరణ వార్త విని ప్రపంచ వ్యాప్తంగా వున్న అభిమానులు బోరున విలపిస్తున్నారు. ఆగస్టు 5న బాలు తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇందులో భయపడాల్సిన అవసరం లేదని, తన అభిమానులు ఎవ్వరూ ఆందోళనకు గురికావద్దని ఓ వీడియో సందేశం ద్వారా బాలు స్పష్టం చేశారు. ఆ తరువాత బాలు చికిత్స కోసం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.
ఒక దశలో బాలు ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఎక్మో పద్దతిలో వెంటిలేటర్ సాహాయంతో ఎంజీఎం వైద్యులు చికిత్సని అందించడం మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గురువారం ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం కన్ను మూశారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై బాలు తనయుడు ఎస్పీ చరణ్ వివరిస్తూ వచ్చారు. తాజాగా మరణ వార్తని కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. నాన్న మధ్యాహ్నం 1:04 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి వివరాల్ని త్వరలో వెల్లడిస్తానన్నారు.