
థియేటర్లు రీఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయినా కొన్ని చిత్రాలు ఓటీటీ బాట పట్టబోతున్నాయి. ఇప్పటికే కొన్ని నేచురల్ స్టార్ నాని నటించిన `వి`.. స్వీటీ అనుష్క నటించిన `నిశ్శబ్దం` వంటి చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇదే బాటలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చిత్రం కూడా ఓటీటీ బాటపట్టబోతోంది. దాదాపు మూడేళ్ల విరామం తరువాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం `రంగమార్తాండ`.
రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెల 15 నుంచి థియేటర్లు రీఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు రిలీజ్ చేసినా కోవిడ్ నిబంధనలని పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లని తెరవలేమని, అందుకు తెరవపోవడమే మంచిదని ఏపీ ఎగ్జిబిటర్స్ భావిస్తున్నారట.
ఇదే విషయాన్ని ఇటీవల రాజమౌళి కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవడం కంటే వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకునే అవకాశ్ ఎప్పుడిస్తారో అప్పుడే రీఓపెన్ చేస్తే మంచిదని సలహాఇచ్చారు. ఇప్పుడు అదే సలహాని ఏపీ ఎగ్జిబిటర్లు పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో జనవరి వరకు థియేటర్లు పూర్తిగా తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ` థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలిసింది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. త్వరలో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.