
`సైరా నరసింహారెడ్డి` వంటి చారిత్రక చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవి మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది.
ఎండోమెంట్ అధికారిగా చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో రాడికల్ స్టూడెంట్ లీడర్‌గా కీలక అతిథి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారు. ముందు ఈ పాత్ర కోసం మహేష్ ని అనుకున్నా అది కుదిరేలా కనిపించకపోవడంతో ఆ పాత్రని మళ్లీ రామ్‌చరణ్ చేతే చేయించబోతున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగే ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్రంలోని రామ్‌చరణ్ పాత్రకు జోడీగా ఎవరు నటిస్తారన్నది గత కొన్ని రోజులుగా చర్చజరుగుతోంది. సమంతని అనుకుంటున్నారని కొన్ని రోజులు వినిపించింది. తాజాగా ఆ స్థానంలో బాలీవుడ్ బామ కియారా అద్వానీతో పాటు కీర్తిసురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారన్నది ఇంకా తెలియాల్సి వుంది. ఈ చిత్రానికి `ఆచార్య` అనే టైటిల్‌ని చిరంజీవి ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.