
`మహానటి` చిత్రంతో అసమానమైన నటనను ప్రదర్శించి విమర్శకులని, ప్రేక్షకులనీ ఔరా అనిపించింది కీర్తి సురేష్. ఈ సినిమా తరువాత నుంచి నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. హైదరాబాద్ బ్లూస్, బాలీవుడ్ కాలింగ్, ఇక్బాల్ వంటి నేటివిటీ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, రమా ప్రభ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగులో ప్రభాస్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ రిలీజ్ చేశారు.
టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా అత్యంత సహజత్వంగా సాగింది. ఇందులో పల్లెటూరి యువతిగా కీర్తి సురేష్ కనిపించింది. బ్యాడ్ లక్ ఉన్న పల్లెటూరి యువతి ఎలా తనని తాను గుడ్ లక్ గా మార్చుకుంది. జాతీయ స్థాయిలో షూటర్‌గా ఎలా ఎదిగింది అన్నదే ఇందులో ఆసక్తికరం. `మన రాతను మనమే రాసుకోవాలా` అనే పాయింట్ నేపథ్యంలో ఓ పల్లెటూరి యువతి కథని నగేష్ కుకునూర్ ఆద్యందం ఆసక్తికరంగా తెరకెక్కించినట్టుగా టీజర్‌ని బట్టి తెలుస్తోంది. నాటకాలు వేసే గోలీ రాజు పాత్రలో ఆది పినిశెట్టి, కీర్తి సురేష్‌ని జాతీయ స్థాయిలో షూటర్‌గా నిలబెట్టే కోచ్‌గా జగపతిబాబు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ మరోసారి జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది.
స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే రోమ్ కామ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. ఓ మైనర్ షెడ్యూల్ మినహా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. బ్యాలెన్స్‌గా వున్న షెడ్యూల్‌ని పూర్తి చేసి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.