
`మహానటి‘కి ముందు నటన పరంగా విమర్శలు ఎదుర్కొంది కీర్తి సురేష్. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా వాటికి `మహానటి`లో తాను ప్రదర్శించిన అద్భుతాభినయంతో మౌనంగానే సమాధానం చెప్పింది. సావిత్రి పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి సావిత్రే తనలోకి ప్రవేశించి తన పాత్రని చేయించుకుందా? అనేంతగా నటించి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పి వారి చేతే ప్రశంసలు పొందింది.
జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకుంది. ఇంతకీ ఈ మహానటి తొలి పారితోషికం ఎంత అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చిన్నతనంలోనే కెమెరా ముందుకొచ్చిన కీర్తి సురేష్ తన తొలి పారితోషికం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `నేను నటించినందుకు నిర్మాతలు నా చేతికి డబ్బుల కవర్ ఇచ్చేవారు. దాన్ని తీసుకెళ్లి నాన్నకి ఇచ్చేదాన్ని. ఇప్పటికీ ఆ డబ్బెంతో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు ఒక షోలో పాల్గొన్నాను. అందుకు నేను తీసుకున్న మొత్తం రూ. 500. ఊహ తెలిశాక అందుకున్నది కాబట్టి అదే నా తొలి సంపాదనగా భావించాను. దీన్ని కూడా సెంటిమెంట్‌గా నాన్నకే ఇచ్చేశాను` అని తెలిపింది కీర్తి సురేష్.
ఇటీవల `రంగ్ దే` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు `సర్కారు వారి పాట`, రజనీకాంత్ తమిళ చిత్రం `అన్నాత్తే`, నగేష్ కూకునూర్ `గుడ్ లక్ సఖి` చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో సర్కారు వారి పాట, అన్నాత్తే చిత్రీకరణ దశలో వుండగా.., నగేష్ కుకునూర్ `గుడ్ లక్ సఖి` విడుదలకు సిద్ధంగా వుంది.