
తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించడం వారి మనోభావాలను దెబ్బతీసినట్టు ఎలా అవుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు. అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ విప్‌లు.. తనపై ఫిర్యాదు చేయడంపై షర్మిల విస్మయం వ్యక్తం చేశారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న షర్మిలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో స్పీకర్ స్పందించారు. స్పీకర్ రియాక్షన్‌తో షర్మిల కూడా రియాక్టయ్యారు. తనపై చర్యలు తీసుకునే ముందు ఒక తల్లిని అవమానించిన మంత్రి నిరంజన్‌రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు.. నాపై చర్యలకు ఆలోచన చేసే ముందు… మీకు ఫిర్యాదు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి నన్ను మరదలు అని అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు షర్మిలా. పరాయి స్త్రీ , ఒక తల్లిని అయిన నన్ను అలాంటి మాటలు మాట్లాడినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల స్పీకర్ పోచారంకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్ ప్రతిపక్షాలపై పచ్చి బూతులు తిట్టారని… ఇక మంత్రి కేటీఆర్ సైతం నిరుద్యోగుల కోసం చేస్తున్న మంగళవారం దీక్షలను వ్రతాలతో పోల్చి మహిళాలోకాన్ని కించపరిచినందుకు ఆయనపై సైతం చర్యలు తీసుకోవాలని సూచించారు. తనపై అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా… తన పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా… పోలీసులను పనోళ్లుగా వాడుకొని తమకు ఇబ్బందులు పెట్టాలని చూసినా.. ఇలా ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తన పాదయాత్రను మాత్రం అడ్డుకోలేరని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.