
`మా`లో తనకు సభ్యత్వం ఇవ్వడానికి నిరాకరించారని టాలీవుడ్‌లో పెద్ద రచ్చకు తెరలేపిన శ్రీరెడ్డి ఆ తరువాత కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌లో ఎక్కువే అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాలను సినిమా రంగానికి ముడిపెడుతూ హీరో పవన్‌కల్యాణ్‌పై వ్యక్తగత దూషణలకు దిగి కలకలం సృష్టించింది. ఆ తరువాత కూడా రాజకీయ విమర్శలతో హద్దులు దాటి పవన్‌ని టార్గెట్ చేయడం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
తాజాగా శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది. నటి కరాటే కళ్యాణి మీడియా ముఖంగా శ్రీరెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనని గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దుర్బాషలాడుతోందని, ఫేస్ బుక్ వేదికగా తనని లైవ్‌లో తిడుతోందని కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
శ్రీరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వున్నాయని, ఆ కారణంగానే ఆమెపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసుల్ని సంప్రదించానని ఈ సందర్భంగా కల్యాణి వెల్లడించారు. శ్రీరెడ్డి ఫేస్ బుక్ వీడియోని పరిశీలించిన ఏసీపీ ఆమెపై ఐటీ చట్టం 67 ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు.