
చందమామ ఫేమ్ కాజల్ మంగళవారం పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన దగ్గరి నుండి అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెష్ అందజేస్తూ వస్తున్నారు. అలాగే ఈ బాబు కు ఏ పేరు పెడతారో అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కాజల్ చెల్లి నిషా అగర్వాల్ బాబు పేరును రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో బాబు పేరు ‘నీల్ కిచ్లు’ అని తెలిపింది.
తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకున్న కాజల్..ముంబైలోని వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడింది. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య షూటింగులో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ వరుస ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ను అలరించింది. ఇక కాజల్ నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.